అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం(Allaince Government) అధికారంలోకి వచ్చిన తరువాత కక్షపూరితంగా తప్పుడు కేసులు నమోదు చేయిస్తుందని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ (TDP) కార్యాలయంపై దాడి కేసులో తన ప్రమేయం లేకున్నా చివరకు నా పేరును కేసులో నమోదు చేయించారని మండిపడ్డారు.
తాను ఢిల్లీ నుంచి గ్వాలియర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా తనకు నోటీసులివ్వడం(Notice) దారుణమన్నారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులపై పెడుతున్న కేసులపై న్యాయవ్యవస్థకు వెళుతామని, తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఏపీలో ప్రభుత్వం అనేది ఉందా ? అరాచకానికి ఒక హద్దు ఉండదా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదని అన్నారు. పాలన ఇష్టారీతిన కొనసాగుతుందని ఆరోపించారు. కూటమి నాయకులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కాం జరిగిందని ఈడీ గుర్తించి ఆస్తుల అటామ్మెంట్ చేసిందని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని ఈడీ భావిస్తుందని అన్నారు.
నాడు చంద్రబాబును జగన్ కక్షపూరితంగా అరెస్టు చేయలేదని, విచారణ జరిపిన తరువాత అరెస్టు చేశారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వైఎస్ జగన్‌ను ఇరికించాలని, ప్రత్యర్థులను భయబ్రాంతులను చేయాలి, వైసీపీని పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.