Srisailam | శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఒకటి, రెండు రోజులు బస చేసేందుకు ప్రయత్నించే యాత్రికులను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్సైట్లు వరుస మోసాలు చేస్తున్నాయి. నకిలీ వెబ్సైట్ల వరుస మోసాలకు గురవుతున్న భాదితులు రోజురోజుకు పెరుగుతున్నారు. రెండు నెలల క్రితం రోహన్ అనే భక్తుడు రూ.28 వేలు మోసపోయాడు. శనివారం క్షేత్రానికి వచ్చిన ముంబై భక్తుడు ఆశిష్.. దేవస్థానం వసతి గదులైన మల్లికార్జున సదన్ పేరిట ఆన్లైన్లో వెబ్సైట్లో వివరాలు పొందుపరిచి గూగుల్ పే ద్వారా రూ.7000 చెల్లించినట్లు యుపీఐ ఐడీ చూపిస్తూ గదులు కావాలని విచారించారు.
అదే విధంగా హైదరాబాద్ వాసి సత్యనారాయణ కూడా మల్లికార్జున సదన్ – శ్రీశైలం- రూం బుకింగ్ వెబ్సైట్లో వసతివసతి గదుల కోసం ముందస్తుగా ఆన్లైన్లో చెల్లించి మోసపోయానని పేర్కొన్నాడు. ఈ తరహా ఆన్లైన్ మోసాలు రెండేండ్లకు పైగా సాగుతున్నాయి. పలువురు భక్తులు దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి ఫలితం లేకపోతుంది. వారాంతపు రోజుల్లో ఇద్దరు, ముగ్గురు భక్తులు ఇలా ఆన్లైన్ మోసాలతో ఇబ్బందుల పాలవుతున్నారు.
ప్రధానంగా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు చేస్తున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత దేవస్థానానిదేనని భక్తులు చెబుతున్నారు. సంవత్సర కాలంగా మల్లికార్జున సదన్ పేరుతో ఆన్లైన్లో మోసపోయిన భక్తులు కొందరు పాతాళగంగ మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున సత్రం వద్దకు వచ్చి తమకు గదులు కేటాయించాలంటూ వాగ్వాదాలకు దిగిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. ఈ వరుస ఆన్లైన్ మోసాలను ఆరికట్టేందుకు దేవస్థానం అధికారులు ఇప్పటికైనా ప్రత్యేక చర్యలు తీసుకుని కేటుగాళ్ల మోసాలకు గురవ్వకుండా భక్తులను కాపాడాలని కోరుతున్నారు.