అమరావతి : ఏపీలో ఈనెల 3న జరుగనున్న పలు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ( Election Commissioner) నీలం సాహ్నికి వైసీపీ(YCP) నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఏపీలో వివిధ కారణాలతో ఖాళీ అయిన తిరుపతి (Tirupati) , నెల్లూరు ( Nellore) , ఏలూరు, పాలకొండ, హిందుపురం, తుని, నూజివీడు (Nujividu), గురజాల, కొవ్వూరు, నందిగామకు చెందిన మున్సిపల్లో మేయర్, చైర్పర్సన్, వైస్‌చైర్మన్ పదవులను భర్తీ చేసేందుకు సోమవారం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఎన్నికలను నిర్వహిస్తుంది.
ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని పేర్కొంటూ వైసీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించాలని, వైసీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఎన్నికలు జరిగే ప్రాంతం వద్ద గట్టి పోలీస్ బందోస్తు కల్పించాలని , సీసీ కెమెరాల మధ్య ఎన్నికల నిర్వహణ జరుగాలని ఆమెను కోరారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్ అబ్జర్వర్లను నియమించాలని విన్నవించారు.
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ( MLC Appireddy) , పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ , వెస్ట్ ఇన్చార్జి వేలంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఇన్చార్జి మల్లాది విష్ణు , ఎమ్మెల్సీ రూహుల్లా , నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.