Tirupati Horror | తిరుపతి జిల్లా కేవీబీ పురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు పక్కన ఉండగానే ఆమె అల్లుడిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నించింది ఓ మహిళ. ఈ పెళ్లిని అడ్డుకోబోయినందుకు కన్న కూతురిపైనే తన అల్లుడితో కలిసి హత్యాయత్నం చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఐదు నెలల క్రితం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల బాలుడు, 15 ఏళ్ల బాలిక ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త మరణించడంతో, ఆ బాలిక తల్లి (40) తన కూతురు అల్లుడితో పాటే నివాసం ఉండేది. ఈ క్రమంలో ఆ మహిళకు కొన్నాళ్లుగా తన అల్లుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. శుక్రవారం రాత్రి బాలిక నిద్రిస్తున్న సమయంలో, తల్లి, అల్లుడు ఏకంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారు. భర్త తన తల్లి మెడలో తాళి కడుతుండగా చూసిన బాలిక వెంటనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ తల్లి, ఆమె అల్లుడు కలిసి బాలికపై తీవ్రంగా దాడి చేశారు. తల్లి రోకలిబండతో కూతురి తలపై మోదడంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న బాలికను కాపాడారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అత్త, అల్లుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేశారు. అనంతరం వారిద్దరిని పోలీసులకు అప్పగించారు. బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.