Migraine | తలనొప్పి అనేది సహజంగానే చాలా మందికి తరచూ వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం కారణంగానే చాలా మంది తలనొప్పి బారిన పడుతుంటారు. అయితే కొన్ని సార్లు తలనొప్పి ఒక పట్టాన తగ్గదు. రోజుల తరబడి అలాగే ఉంటుంది. పైగా తలను ఎవరో బలమైన వస్తువుతో కొడుతున్నట్లు అనిపిస్తుంది. తల చుట్టూ విపరీతమైన నొప్పిగా ఉంటుంది. ఇది కొన్ని రోజులు లేదా వారాల తరబడి అలాగే ఉంటుంది. దీన్నే మైగ్రేన్ అంటారు. తలనొప్పికి, మైగ్రేన్‌కు దగ్గరి పోలిక ఉన్నా వాస్తవానికి ఇవి రెండూ భిన్న రకాల అనారోగ్య సమస్యలు. తలనొప్పి వచ్చేందుకు, మైగ్రేన్ వచ్చేందుకు భిన్న రకాల కారణాలు ఉంటాయి. మైగ్రేన్‌ను నాడీ సంబంధ సమస్యగా చెప్పవచ్చు. కనుక మైగ్రేన్‌లో భాగంగా వచ్చే తలనొప్పి మరీ తీవ్రంగా ఉంటుంది. కొన్ని సార్లు ఈ నొప్పిని అసలు భరించలేకపోతారు.
మెదడుకు అనుసంధానం అయి ఉండే నాడులు లేదా రక్త నాళాలు వాపులకు గురైనప్పుడు నొప్పి వస్తుంది. దీన్నే మైగ్రేన్ గా చెబుతారు. కొందరికి రోజుల తరబడి సాధారణ తలనొప్పి ఉండి అది మైగ్రేన్ గా మారేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలంగా ఒత్తిడి ఉంటే అది మైగ్రేన్ గా మారుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం, నిద్రపోవడంలో మార్పులు చోటు చేసుకోవడం, వాసనలను ముక్కు సరిగ్గా పసిగట్టలేకపోవడం, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా మైగ్రేన్ వస్తుంది. అయితే స్త్రీలకు ఇది రుతు సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా వారిలో హార్మోన్లలో మరీ తీవ్రమైన హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మైగ్రేన్ సమస్య వస్తుంది. ఇది వచ్చిన వారు డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. అలాగే పలు ఆహారాలను తీసుకుంటున్నా కూడా మైగ్రేన్ నుంచి బయట పడవచ్చు. తలనొప్పి తగ్గుతుంది.
మైగ్రేన్ ఉన్నవారు యాంటీ ఇన్ ఫ్లామేటరీ ఆహారాలు లేదా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను తింటుండాలి. అవిసె గింజలు, వాల్ నట్స్‌లో ఈ రెండు స్వభావాలను కలిగి ఉంటాయి. కనుక వీటిని రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే ఉపయోగం ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టి తినాల్సి ఉంటుంది. దీని వల్ల వాపులు తగ్గిపోతాయి. మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పసుపు, అల్లం కూడా మనకు మేలు చేస్తాయి. వీటిల్లో సహజసిద్ధమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. దీని వల్ల మైగ్రేన్ తగ్గిపోతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నిషియం అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తరచూ తింటుండాలి. ముఖ్యంగా పాలకూర, తోటకూర, బచ్చలికూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, దానిమ్మ పండ్లు, టమాటా, బీట్ రూట్, కివిలు, పైనాపిల్, బొప్పాయి, అరటి పండ్లు, పుచ్చకాయలు, తర్బూజాలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. ఇవన్నీ మైగ్రేన్ ను తగ్గించేందుకు ఎంతగానో సహాయం చేస్తాయి.
సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఓట్ మీల్, బ్రౌన్ రైస్, కినోవా వంటి ఆహారాలను తింటుండాలి. ఇవి శరీరానికి నిరంతరం శక్తిని అందిస్తుంటాయి. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల వాపులు తగ్గుతాయి. మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజూ తగినంత నీటిని తాగుతుండాలి. నీళ్లను సరిగ్గా తాగకపోతే డీహైడ్రేషన్ ఏర్పడి తలనొప్పి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో మైగ్రేన్‌గా మారే ప్రమాదం ఉంటుంది. కనుక రోజూ నీళ్లను తగిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. అలాగే మెగ్నిషియం అధికంగా ఉండే పాలకూర, గుమ్మడికాయ విత్తనాలు, బాదంపప్పు, బ్లాక్ బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కూడా మైగ్రేన్ నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. ఇలా ఆయా ఆహారాలను రోజూ తీసుకుంటుంటే మైగ్రేన్‌ను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.