విజయవాడ: ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మోదీ కామెంట్లను ఆయన పూర్తిగా తప్పుబట్టారు. ఏపీ విభజన విషయంలో అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలే అని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ విభజన విషయంలో పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనంత అన్యాయం జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాపోయారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండానే ఏపీ విభజన ప్రక్రియ పూర్తి చేశారని చెప్పారు. రాజ్యాంగ విరుధంగా బీజేపీ మద్దతివ్వడం వల్లనే విభజన బిల్లు ఆమోదం పొందిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ తల్లిలా వ్యవహరిస్తే.. చిన్నమ్మలా తాము సహకరించామని సుష్మా స్వరాజ్ అప్పట్లో చేసిన మాటలను ఉండవల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మోదీ తాజా కామెంట్లపై మరోసారి పార్లమెంట్లో చర్చ జరిగితే.. అసలు విషయాలు బయటికి వస్తాయని ఉండవల్లి అన్నారు.
కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం చేశామని చెప్పుకున్న బీజేపీ నేతలు.. గతంలో అద్వానీ చేసిన కామెంట్లను కూడా పట్టించుకోవాలని ఉండవల్లి సూచించారు. పార్లమెంట్ తలుపులు మూసి విభజన బిల్లు పాస్ అవడానికి బీజేపీ ఎంపీలే కారణమని ఆరోపించారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పి రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చారని, తన ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన మాటల్ని జగన్ మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పార్లమెంటు సాక్షిగా ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఉండవల్లి సూచించారు.