Rayapati Srinivas | టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కుటుంబంలో విభేదాలు బయట పడ్డాయి. తాము టీడీపీలోనే కొనసాగుతామని ఆయన తనయుడు రాయపాటి శ్రీనివాస రావు ఆదివారం మీడియాకు చెప్పారు. తాము రాయపాటి రంగారావును ప్రోత్సహించడం లేదని అన్నారు. తొలి నుంచి ఇప్పటి వరకూ తాము ఉమ్మడి కుటుంబంగానే ఉన్నామని తెలిపారు. ఇంతకుముందు రాజకీయ అంశాలపై కుటుంబ సభ్యులందరం మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకునే వారం అని పేర్కొన్నారు. కానీ తమ కుటుంబంలో అభిప్రాయ భేదాలు వచ్చాయని అంగీకరించారు. తాము మాత్రం టీడీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లతో తమకెటువంటి ఇబ్బంది లేదన్నారు.
ఇదిలా ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ సీటుపై రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు కన్నేశారు. కానీ, ఆ స్థానాన్ని మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు చంద్రబాబు ఖరారు చేసిన నేపథ్యంలో రంగారావు నిరాశకు గురయ్యారు. దీంతో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కన్నాకు టికెట్ ఇస్తున్నట్లు తనకు మాటమాత్రంగానైనా చెప్పలేదని వ్యాఖ్యానించారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిన రాయపాటి రంగారావు టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబాన్ని ఆ పార్టీ సర్వ నాశనం చేసిందన్నారు. మంగళగిరిలో నారా లోకేశ్ ఎలా గెలుస్తాడో చూస్తానంటూ తీవ్రంగా స్పందించారు.