Roja Selvamani | గేమ్‌ఛేంజర్ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తుండగా ఇద్దరు అభిమానులు మరణించించడానికి గత ప్రభుత్వమే కారణమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా సెల్వమణి మరోసారి మండిపడ్డారు. సినిమాలను తీసి మా పిల్లల్ని చంపేస్తున్నారంటూ బాధిత తల్లి ఆవేదనతో మాట్లాడిన ఒక వీడియోను ట్విట్టర్లో రోజా పెట్టారు. కన్నబిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుడుగుతున్న ప్రతి మాటకు సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. ఒక్కసారి ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడాలని హితవు పలికారు.
నిన్న కూడా పవన్ కల్యాణ్‌పై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రోజా మండిపడ్డారు. మానవత్వం మరిచి నిందలు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ చనిపోయి మూడు రోజులైనా వారి కుటుంబాలను పరామర్శించకపోగా చౌకబారు రాజకీయం చేయడం తగునా అని ప్రశ్నించారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ లు మరణించడం బాధాకరమని రోజా సెల్వమణి అన్నారు. తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి మూడు రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కనీసం పరామర్శించకపోవడం అమానవీయమని అన్నారు. తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప టీమ్ మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు తన అభిమానులు మరణించి మూడు రోజులైనా వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆ యువకుల తల్లులు, కుటుంబాల కన్నీటి రోదన కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా @PawanKalyan? ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!!#SaveAPYouth pic.twitter.com/PboRQmUQXc
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 7, 2025
బాధితుల కుటుంబాలను పరామర్శించకపోగా వీరి మరణానికి గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వేయకపోవడమే కారణమని చౌకబారు రాజకీయం చేయడం తగునా అని పవన్ కల్యాణ్‌ను రోజా నిలదీశారు. ఏడు నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీ ప్రభుత్వ మే కదా అని ప్రశ్నించారు. 7 నెలలుగా ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నది మీరే కాదా పవన్ కళ్యాణ్ అని అడిగారు. అంటే వీరిద్దరి మరణానికి మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు కారణం కాదా అని ప్రశ్నించారు. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పుష్పకేమో నీతులు చెప్తారా? గేమ్‌ఛేంజర్‌కి పాటించరా అంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రశ్నించారు.