AP News | కూరగాయలు అమ్మినట్లుగా నడిరోడ్డు మీదే మందు అమ్ముతున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంతలో ఓ బెల్ట్ షాపు నిర్వాహకుడు నడి రోడ్డు మీదనే మద్యం అమ్ముతూ కనిపించాడు. దీన్ని చూసిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత రోజా సెల్వమణి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వీడియో చూడండి బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో.. చిన్న పిల్లల్ని, విద్యార్థుల్ని పెట్టి మద్యం అమ్మిస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎక్కడో కాదు.. చంద్రబాబుకు ఓటేసిన ఆంధ్రప్రదేశ్‌లోనే అని తెలిపారు. జగనన్న విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే.. చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చేశారని రోజా ఆరోపించారు. తణుకులో ఇలా విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు వెలిశాయని అన్నారు. టీడీపీ నేతలే మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల మధ్యలో, మహిళలు నడిచే మార్గాల్లో చిన్న పిల్లల్ని పెట్టి ఇలా మద్యం అమ్ముతున్నారని చెప్పారు. ఇదేనా మంచి ప్రభుత్వం అని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించారు. పిల్లల్ని పెట్టి మద్యం అమ్మించడం భావ్యమేనా అని ప్రశ్నించారు.
జగనన్న విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే..
చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారు..ఈ వీడియో చూడండి…
ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో..
చిన్నపిల్లల్ని.. విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారు..ఇది ఎక్కడో కాదు..
చంద్రబాబు కి ఓటేసిన ఆంధ్రప్రదేశ్ లోనే… pic.twitter.com/8UG1ZGT3lK— Roja Selvamani (@RojaSelvamaniRK) October 28, 2024
నడిరోడ్డుపై మద్యం అమ్ముతున్న వీడియో వైరల్ కావడంతో ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు. వెంటనే మద్యం విక్రేతలు షేక్ మున్నా, కొప్పిశెట్టి శివశంకర్ కొల్లి సుకన్యలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7800విలువైన 60 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.