అమరావతి : పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Ex-Minister Peddireddy) అవినీతి, అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు ఈనెల 5 నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister RamPrasad Reddy) వెల్లడించారు. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలు(Corruption) , భూముల దందాపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు.
చిత్తూరు(Chittoor) లో మూడు ఆర్టీసీ డిపోలకు చెందిన 17 కొత్త బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు (Free Bus) సౌకర్యం అమలుపై పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధానాలను తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తీసుకువస్తామన్నారు.
సూపర్ సిక్స్ (Super Six) పథకాల హామీల అమలుకు సీఎం చంద్రబాబు , ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అధికారుల అధ్యయనం తరువాత ఇచ్చే నివేదికల ఆధారంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తామని వివరించారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టడంతోపాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడం కోసమే కొత్త బస్సులు తీసుకువస్తున్నామని అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.