Peddireddy Ramachandra Reddy | చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగానే పనిచేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తనపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మదనపల్లిలో రికార్డులు తగలబడితే తనపై నిందలు వేస్తున్నారని అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ దర్యాప్తు సంస్థతోనైనా ఈ కేసును ప్రభుత్వం దర్యాప్తు చేయించుకోవచ్చని తెలిపారు.
ఆధారాలు లేకుండా అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాలు విసిరారు. తన కుటుంబంపై అనవసరంగా రోపణలు చేస్తున్నారని అన్నారు. తమ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచామని చెప్పారు. అయినప్పటికీ కేసులు వేసి వేధించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రలు రాష్ట్ర ప్రజలకు తెలుసు అని పెద్దిరెడ్డి అన్నారు. రికార్డులు కాలిపోయాయని ఏకంగా డీజీపీనే హెలికాప్టర్ వేసుకుని వచ్చారని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదని తెలిపారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమి.. అత్యుత్సాహంతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేకనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ అంటేనే చంద్రబాబు భయపడుతున్నారని.. అందుకే ఖజానాలో డబ్బులు లేవని సాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన క్యారెక్టర్ దెబ్బతీసేవిధంగా చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.