టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సవాలు విసిరారు. ఇసుక అక్రమ రవాణాలో తనకు సంబంధం ఉందని సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. తాను తప్పు చేసినట్లు నిరూపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని ప్రశ్నించారు.
నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. తాను చెప్పిన పనులు అధికారులు చేయడం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫ్రస్టేషన్లో ఉన్నారని అన్నారు. తాను చెప్పిన వారిని కేసుల్లో ఇరికించడం లేదని ఆయన బాధపడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి బతుకు అంతా అవినీతిమయమే అని విమర్శించారు. తనపై సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమే అని చెప్పారు. కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచంలో పడుకొని ఉన్నా లాక్కొస్తామని హెచ్చరించారు.
నాపై చేస్తున్న అవినీతి ఆరోపణల్లో ఒక్కదానిని అయినా రుజువు చేయగలవా అని సోమిరెడ్డిని కాకాణి ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే నేను అవినీతి చేసినట్లు నిరూపించు అని సవాలు విసిరారు. సూరాయిపాలెం ఇసుక రీచ్‌లో జరుగుతున్న తవ్వకాలపై గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్తామని తెలిపారు. నీరు చెట్టులో జరిగిన అవినీతి మీద విచారణకు ఆదేశిస్తే అధికారుల ఉద్యోగాలు పోతాయని మానవత్వంతో వెనక్కి తగ్గానని తెలిపారు. మైనింగ్ కాంట్రాక్టర్లతో చంద్రబాబు దగ్గరకు వెళ్తే సోమిరెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. సోమిరెడ్డి అవినీతి మీద విచారణ చేయాలని కోరారు. నేను చేస్తున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తును ఎదుర్కొనే దమ్ముందా అని ప్రశ్నించారు.