హైదరాబాద్, మే 29 (నమస్తేతెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో జన్మించిన గాదె వెంకట్‌రెడ్డి ఎల్ఎల్బీ పూర్తిచేసిన అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.
నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆయన మృతికి సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్, జానారెడ్డి సంతాపం తెలిపారు.