Pushpa 2 | పుష్ప 2 చిత్రంపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్స్‌పై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు స్పందించారు. అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమాపై కొందరికి అసూయగా ఉందని.. కానీ ఆ సినిమా విజయాన్ని ఆపలేరని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అతనొక ఇంటర్నేషనల్ స్టార్ అని తెలిపారు. పుష్ప 2ను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని పేర్కొన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలని చూశారని.. కానీ ఏమైందని ప్రశ్నించారు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారని స్పష్టం చేశారు.
పుష్ప 2 సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అంబటి రాంబాబు తెలిపారు. తాను కూడా ఆ సినిమాను చూసేందుకు రెడీగా ఉన్నానని పేర్కొన్నారు. పుష్ప 2 సినిమాపై కొంతమందికి జెలసీగా ఉందని అన్నారు. అరచేతిని అడ్డం పెట్టుకుని ఒక సినిమా విజయాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ చిత్రాలను అడ్డుకోవాలని అనుకోవడం అవివేకమని విమర్శించారు.
వైసీపీకి చెందిన సోషల్‌మీడియా కార్యకర్తలను అరెస్టు చేయడంపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడితే టీడీపీ వాళ్లు కూడా అరెస్టు చేస్తామని సీఎం చంద్రబాబు నీతి వాక్యాలు చెప్పారని.. మరి వైసీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు తమ కుటుంబ సభ్యులపై టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై ఈ నెల 17, 18 , 19వ తేదీల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆ ఫిర్యాదులపై నిన్న సదరు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా.. స్పష్టమైన సమాధానం రాలేదని చెప్పారు.
స్పీకర్‌గా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబు తెలిపారు. మంత్రి నారా లోకేశ్ కూడా జగన్‌పై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని.. వారు స్పందించకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.