Atchutapuram | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్‌దే అని బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. వైఎస్ జగన్ నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారని విమర్శించారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే అచ్యుతాపురంలోని ఎసెన్షియాలో ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
ఇకనైనా జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని సవిత హితవుపలికారు. ఎసెన్షియా పాపం ముమ్మాటికీ జగన్‌దే అని విమర్శించారు. అచ్యుతాపురం సెజ్ ఘటన గురించి తెలిసిన వెంటనే తమ నాయకుడు చంద్రబాబు స్పందించారని.. ఆగమేఘాల మీద మృతుల కుటుంబాలకు కోటి చొప్పున నష్టపరిహారం అందించారని తెలిపారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను కలిసి చంద్రబాబు భరోసా ఇచ్చారని అన్నారు.
కాగా, అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధాలే జన్మనక్షత్రం, తప్పుడు ప్రచారాలే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన అబద్ధాలు నమ్మమని ముఖం మీద కొట్టి 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని ఆరోపణలు చేశారు. ప్రమాదంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అన్ని విధాల అండగా నిలబడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదంలో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందించి అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ధర్నా చేస్తానని జగన్ రెడ్డి ప్రకటించడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఈ సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం, అంబులెన్స్‌లు వచ్చి వైద్యం అందిస్తే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని జగన్ ఎలా అంటున్నారని నిలదీశారు.