Kasibugga | కార్తీక మాస ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదని.. అది పూర్తిగా ప్రైవేటు ఆలయం అని స్పష్టం చేశారు.
ఈ ఆలయం హరిముకుంద్ పండా అనే వ్యక్తి తన 12 ఎకరాల సొంత భూమిలో నిర్మించారని ఆనం రామనారాయణ రెడ్డి విరించారు. ఇది పూర్తిగా ప్రైవేటు ఆలయమని స్పష్టం చేశారు. ఈ ఆలయ సామర్థ్యం 2 వేల నుంచి 3 వేల మంది వరకు మాత్రమే ఉండగా.. ఏకాదశి సందర్భంగా 15 వేల మంది వరకు ప్రజలు వచ్చారని అన్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేకపోయారని తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వలేదని అన్నారు. దీనివల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారం వ్యక్తం చేశారు.
మరోవైపు శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాటపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. ఈ ఆలయంతో దేవాదాయ శాఖకు సంబంధం లేదని తెలిపారు. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చెందినది అని తెలిపారు. సొంత నిధులతో ఓ వ్యక్తి ఈ ఆలయం నిర్మించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక నుంచి ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.