తిరుపతి : ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంథాలు, పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తుందని టీటీడీ ఈవో, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎవి ధర్మారెడ్డి వెల్లడించారు. ఉత్తరాయణం, దక్షిణాయనం లాంటి లెక్కలు ఈ కోవలోకే వస్తాయని ఆయన పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నవగ్రహ మఖ శ్రీ సుదర్శన పారమాత్మక యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వేద విద్య అభ్యసిస్తున్న వారు ఆంగ్లం, హిందీ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాలని ఆయన సూచించారు. వీటిని నేర్చుకోగలిగితేనే వేద విద్య ను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసే రాయబారులుగా రాణించవచ్చని తెలిపారు. వైద్య విద్య కంటే వేద విద్యాభ్యాసం చాలా కష్టమన్నారు. వేద విద్య ఒక మతానికి సంబంధించినది కాదన్నారు.నవగ్రహాల గురించి కూడా వేల సంవత్సరాల కిందటే ఆర్ష గ్రంథాలు, పురాణాలలో చెప్పడం జరిగిందన్నారు.
వేద విశ్వవిద్యాలయానికి త్వరలోనే కొత్త వీసీ నియామకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్య అతిథిగా పుదుచ్చేరి విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఆంజనేయ శర్మ హాజరు కాగా, జెఈవో సదా భార్గవి తదితరులు పాల్గొన్నారు.