Srisailam Temple | శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు క్షేత్రానికి వచ్చే భక్తులకు సంపూర్ణ దర్శనం కల్పించడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వారితో స్నేహభావంగా మర్యాదపూర్వకంగా మెలిగేలా సిబ్బందికి తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. ఆలయ పరిపాలనా భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామోత్సవంలో వివిధ కళారూపాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్ని వాహన సేవలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
నవరాత్రులలో క్షేత్రానికి వచే యాత్రికులు క్యూలైన్లు, మంచినీరు, వసతి సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు. ఈ నెల 3న నుంచి జరిగే దేవిశరన్నవరాత్రులను యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా ప్రారంభించి కలశస్థాపన, మండపారాధన అఖండజ్యోతి, మహగణపతి పూజ, జపానుష్టానాలతో పాటు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ చండీ, రుద్రపారాయణాలను నిర్వహించాలని నిర్ణయించారు. అధేవిధంగా దేశి శరన్నవరాత్రులలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు మినహ మిగిలిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు తెలిపారు. వాహనసేవలను సామాన్య భక్తులు సైతం వీక్షించేవిధంగా ఎల్ఈడీ స్కీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈవో వివరించారు.