Srisailam | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజైన మంగళవారం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు నిర్వహించారు. అనంతరం రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిపించారు. ఈ సాయంకాలం జపాలు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం తదితర కృతువులు నిర్వహించారు. రాత్రి 9 గంటల నుంచి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు చేశారు. దసరా మహోత్సవాల్లో ప్రతిరోజూ కుమారి పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి తెలిపారు. రెండేళ్ల నుంచి పదేళ్ల వయసునున్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతోందని.. కుమారిపూజ నవరాత్రి ఉత్సవాల్లో ఓ కీలకమైన సంప్రదాయమని పండితులు తెలిపారు.
Srisailam Dasara Mahotsavam
ఉత్సవాల్లో రెండోరోజు అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. నవదుర్గల్లో ద్వితీయ రూపమైన ఈ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగగడంతో పాటు విజయాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. బ్రహ్మచారిణి ఉపాసన వలన త్యాగ, వైరాగ్య భావాలు కలుగుతాయని దేవీభాగవతంలో చెప్పిందని.. అందుకే ఈ స్వరూపాన్ని సిద్ధులు, యతులు ఎక్కువగా ఉపాసిస్తారని.. ఆ దేవిని పూజించడం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోతుందని.. కుడిచేతిలో జపమాల, ఎడమచేతిలో కమండలాన్ని ధరించి ఉన్న దేవిని పూజించడం వలన మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయని పండితులు చెప్పారు.
Srisailam Dasara Mahotsavam
గ్రామోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై విహరించారు. సాయంత్రం సమయంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన మయూరవాహనంపై వేంచేపు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామోత్సవంలో నిర్వహించగా.. పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి.. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాదస్వరం, కేరళ చండీ మేళం, కొమ్ము, కోయ నృత్యం, థయ్యం, విళక్కు, స్వాగత నృత్యం, కోలాటం, రాజభటుల వేషాలు, జానపద పగటి వేషాల ప్రదర్శన, అశ్వ ప్రదర్శన, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లన్నగ్రోవి, శంఖం, త్రిశూలం, జేగంట, కంచుడోలు, కొమ్ము, తాళాలు, చెక్కభజన, చిడతలు, శంఖం, తప్పెట చిందు, డోలు విన్యాసం, వీరభద్ర డోలుకుణిత కన్నడ జాపద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే, దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద నిర్వహించిన ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.