విజయవాడ : టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో భేటీ అవడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనను అమిత్ షా మెచ్చుకున్నారని బీజేపీ అధికారికంగా ప్రకటన విడుదల చేసిందని గుర్తుచేసిన బుద్దా వెంకన్న.. జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షాల భేటీని రాజకీయ కోణంలో చూడొద్దని హితవు పలికారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జూనియర్ ఎన్టీఆర్ నటనను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడంతో అమిత్‌షా కూడా ఆయనను కలవాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆ మేరకే జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి అభినందించారని పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా భేటీ ఆయ్యారు. హైదరాబాద్‌లో చాలా ప్రతిభావంతులైన నటుడు, మన తెలుగు సినిమా రత్నం జూనియర్ ఎన్టీఆర్‌తో మంచి ఇంటరాక్షన్ జరిగిందని అమిత్‌షా సమావేశం అనంతరం ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. వీరి భేటీని రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనను మెచ్చుకునేందుకు కలిసినట్లు పేర్కొన్నారు.
కాగా, ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కనుసైగలతో వారు పనిచేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం తగదన్నారు. ఇదే విధంగా పోలీసులు తీరు కొనసాగితే తాడేపల్లిలోని సీఎం ప్యాలెస్‌ను ముట్టడిస్తామని, ప్రజాచైతన్యం ఎలా ఉంటుందో జగన్ సర్కార్ చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లకుండా నారా లోకేశ్‌ను అడ్డుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. జనాలను పరామర్శించడం జగన్ పేటెంట్ అని పోలీసులు భావిస్తున్నారని విమర్శించారు. జగన్ దోపిడీని ప్రశ్నిస్తున్నందుకే ఇలా టీడీపీ నేతల్ని అడ్డుకుంటున్నారని దుమ్మెత్తి పోశారు.