రంగారెడ్డి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ( Capital Amaravati ) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ( Venkaiah Naidu ) అన్నారు. కొందరు అనవసర రాద్దాంతాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో స్వర్ణ భారత్ ట్రస్టులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంటుందని, విభజన తరువాత ఏపీకి రాజధాని లేకుండా పోయిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతిని రాజధానిగా గుర్తించి అందుకు అవసరమయ్యే అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజధాని అంటే గుంటూరు, విజయవాడ, గన్నవరం తదితర ప్రాంతాలు కలిసి ఏర్పడ్డ ప్రాంతామని అన్నారు.
హైదరాబాద్ మాదిరిగా భవిష్యత్లో రాజధాని అమరావతి కూడా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీలోని అన్ని జిల్లాల్లో యువతకు సమగ్ర నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి ప్రాంతాలను అభివృద్ధి చేపట్టాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ,హస్య నటుడు బ్రహ్మానందం, ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.