Srisailam | కుండపోత వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట పాతాళ గంగ మధ్యన సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు విరిగిపడుతుండటంతో శ్రీశైలం ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో నాగర్‌కర్నూలు ఎస్పీ గైక్వాండ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్లొద్దని సూచించారు. ఘాట్ రోడ్డు మార్గంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా శ్రీశైలం పర్యటనను విరమించుకోవాలని ఆదేశించారు.
కాగా నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రతండా వద్ద తెలంగాణ పోలీసులు ఓ చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రయాణికులను మధ్యలోనే ఆపి వెనక్కి పంపిస్తున్నారు.