అమరావతి : ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను(MLC Duvvada Srinu) తో వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి (Divvela Madhuri ) ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇటీవల ఆమెపై వస్తున్న తప్పుడు ఆరోపణలు, ట్రోలింగ్స్‌ను చూడలేక ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించానని వెల్లడించింది.
ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ వద్ద ఆగి ఉన్న కారును వేగంగా వెనుక నుంచి వచ్చి మరో కారును ఢీ కొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడ్డ మాధురిని పలాస ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ ‘నేను డిప్రెషన్లో ఉన్న .. చనిపోయేందుకే బయటకి వచ్చానని’ పేర్కొన్నారు.
దువ్వాడ శ్రీనివాస్, నాపై , నా ముగ్గురు ఆడ పిల్లలపై వస్తున్న ట్రోలింగ్స్‌ను భరించలేక కారు ఆక్సిడెంట్తో ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న దువ్వాడ శ్రీను భార్య శ్రీవాణిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తన పిల్లలపై చేసిన ఆరోపణలపై కూడా చిల్డ్రన్ రైట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరోసారి ఆత్మహత్యా యత్నానికి ఒడిగడుతానని హెచ్చరించారు.
గత రెండురోజులుగా ఏపీలో హాట్‌టాపిక్‌గా మారిన ఎమ్మెల్సీ వ్యవహారంలో దువ్వాడ శ్రీను భార్య శ్రీవాణి మాధురిపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఆరోపిస్తూ శ్రీను ఇంటిపై కూతుళ్లతో కలిసి దాడి చేసింది. దివ్వెల మాధురి అనే మహిళతో సంబంధం పెట్టుకుని తమను వదిలేశారని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై దివ్వెల మాధురి కూడా స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్‌ను తాను ట్రాప్ చేయలేదని స్పష్టం చేశారు. తననే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి రాజకీయంగా తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసం తనను పావుగా వాడుకుందని తెలిపారు.