తిరుమల: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులకు నేరుగా స్వామివారి దర్శనం అవుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు.
నిన్న స్వామివారిని 70,610 మంది భక్తులు దర్శించుకోగా 17,310 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల స్వామివారికి రూ. 3.78 కోట్లు ఆదాయం వచ్చిందని అన్నారు.
గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రారంభమైన అధ్యయనోత్సవాలు
తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయని అర్చకులు తెలిపారు. మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఇందులో భాగంగా ప్రతిరోజూ రాత్రి 7.15 గంటలకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను తీసుకొచ్చి దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునికృష్ణా రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.