అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం ( Alliance Government ) ఏర్పడిన వందరోజుల్లోనే ఇరుపార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అధికార భాగస్వామ్యంలో ఉన్న మంత్రులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారంటూ ఒకరినొకరు దుమ్మేతిపోసుకుంటున్నారు. తాజాగా బీజేపీ(BJP) కి చెందిన రాష్ట్ర మంత్రిని టీడీపీ(TDP) శ్రేణులు అడ్డుకుని నిరసన తెలిపిన ఘటన శనివారం చోటు చేసుకుంది.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డికి సహకరించిన కమిషనర్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ఐదురోజులుగా టీడీపీ శ్రేణులు ధర్మవరంలో ఆందోళనను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ధర్మవరం (Dharmavaram) మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్(Minister Satyakumar Yadav) శనివారం పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావును సమర్ధుడు అయినందున అతడిని కొనసాగిస్తున్నామని వెల్లడించడంతో టీడీపీకి చెందిన పరిటాల శ్రీరాం అనుచరులు భగ్గుమన్నారు.
మంత్రి ఎన్డీయే కార్యాలయానికి వెళ్లగా టీడీపీ శ్రేణులు అక్కడికి వెళ్లి నిరసనలు తెలిపారు. మంత్రి కారులో తిరిగి వెళ్లిపోతుండగా మున్సిపల్ కమిషనర్‌ను ధర్మవరం నుంచి బదిలీ చేయాలని నినాదాలు చేస్తూఅడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని మంత్రి సత్యకుమార్‌ను అక్కడి నుంచి సురక్షితంగా పంపించి వేయడంతో పరిస్థితి సద్దు మణిగింది.