తిరుమల : ఏపీలోని మరిన్ని ఆలయాలకు ధూప, దీప నైవేద్యం (Dhupa and Deepam ) కింద నిధులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramanarayana reddy) వెల్లడించారు. ఇప్పటికే ఆలయాలకు ఇస్తున్న నిధులను రెన్యూవల్ చేశామని తెలిపారు. గురువారం తిరుమలలో మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Subhash) తో కలిసి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో పండితులు వారిని శాలువలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. తిరుమల మఠాల అక్రమాలపై టీటీడీ పాలకమండలి దృష్టి సారించిందని తెలిపారు.
తిరుమలలో నాలుగు మాసాల్లోనే చాలా మార్పు వచ్చిందని అన్నారు. భవిష్యత్లోను ఆలయాన్ని దర్శించి భక్తులకు సౌకర్యాల కల్పనను పరిశీలిస్తామన్నారు. ప్రస్తుతం ధూప,దీప నైవేద్యాలకు ఇస్తున్న రూ. 5వేలను , కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 10 వేలకు పెంచి ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,400 ఆలయాలకు ధూప, దీప నైవేద్యానికి నిధులు ఇస్తున్నామని వెల్లడించారు.