Kethireddy | ఏపీ రాజకీయాలపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హీరోలకు మాత్రమే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అభిమానులు చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ధర్మవరంలో శనివారం నాడు కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హిందూపూర్‌లో కాబట్టి నందమూరి బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. హిందూపూర్‌లో కాకుండా.. గుడివాడలో అయితే మూడుసార్లు గెలవలేరని తెలిపారు. సినిమా హీరోగా ఉన్న చిరంజీవి కూడా రెండు చోట్ల నిలబడితే.. తన సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో ఓడిపోయారని గుర్తు చేశారు. తిరుపతిలో మాత్రమే గెలిచారని అన్నారు.
రాష్ట్రంలో క్రౌడ్పుల్లర్స్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది జగన్, పవన్ కల్యాణ్ మాత్రమేనని కేతిరెడ్డి తెలిపారు. జగన్ అయినా.. పవన్ కల్యాణ్ అయినా వస్తే పది నిమిషాల్లోనే 10వేల మంది గుమ్మిగూడతారని పేర్కొన్నారు. వారి మీద ప్రేమతో వస్తారని తెలిపారు. అయితే జగన్‌కు రాజకీయంగా జనం వస్తారని.. పవన్ కల్యాణ్‌కు మాత్రం సినిమాల పరంగానే జనం వస్తారంటూ వివరించారు. అదే చంద్రబాబు లేదా టీడీపీ నాయకులు అయితే మీడియా మేనేజ్మెంట్ మాత్రమే చేస్తారని ఎద్దేవా చేశారు. కమల్ హాసన్ కంటే పవన్ కల్యాణ్ గొప్ప నటుడేమీ కాదని కేతిరెడ్డి విమర్శించారు. అయినప్పటికీ కమల్ హాసన్ ఎన్నికల్లో నిలబడితే ఓడిపోయారని చెప్పారు. తమిళ నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టారని.. పాలిటిక్స్ అంత ఈజీ కాదని అన్నారు. వాళ్లు సినిమాల్లో మాత్రమే హీరోలు.. రియల్ లైఫ్‌లో కాదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రాజకీయాలు దారుణంగా ఉన్నాయని కేతిరెడ్డి అన్నారు. చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ కీలుబొమ్మలా మారాడని విమర్శించారు. ఆయనకు ఒక భావజాలం అంటూ ఏదీ లేదని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు విజన్ ఎక్కడుందని ప్రశ్నించారు. చరిత్రలో నిలిచిపోయే ఒక్క పథకమైనా ప్రారంభించారా అని నిలదీశారు.