అమరావతి : తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గత వారం రోజుల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు కుటుంబ సభ్యులతో తిరుమల కొండకు తరలివస్తున్నారు. దీంతో బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
అలాగే, వైకుంఠ క్యూ కాంప్లెక్సులోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక మంగళవారం అర్ధరాత్రి వరకు శ్రీవారిని 78,631 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.