తిరుమల : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా మలయప్పస్వామి గురువారం బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ (Suryaprabha) వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాతని అర్చకులు తెలిపారు.
ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వెల్లడించారు. ఈ సందర్భంగా వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు.
మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. ఈరోజు రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి ఊరేగుతారని వివరించారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ(TTD) ఈవో జె.శ్యామల రావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.