Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా తీరాన్ని తాకింది. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తుపాను తీరాన్ని తాకిందని వాతావరణశాఖ తెలిపింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వచ్చిందని.. మంచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని పేర్కొంది. కాకినాడకు 110 కిలోమీటర్లు, విశాఖకు 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణశాఖ తెలిపింది.
తీరం దాటే సమయంలో 90 నుంచి వంద కిలోమీటర్లకుపైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. మొంథా తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో మచిలీపట్నం, కాకినాడకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుపాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్గఢ్ వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, ప్రకాశంతో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు చెట్ల నేల కూలాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అలలు ఎగిసిపడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.