Cyclone Montha Alert | ఏపీకి మొంథా తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ- వాయవ్య దిశగా కదులోంది. ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
మచిలీపట్నం – కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుపాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుపాన్ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక జాగ్రత్తలు చేసింది.
☞ పుకార్లను నమ్మవద్దు. ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు.
☞ అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటూ ఉండండి. వాతావరణ హెచ్చరికల కోసం ఎస్ఎంఎస్లను గమనిస్తూ ఉండండి.
☞ మీ భద్రత, మనుగడ కోసం అవసరమైన వస్తువులతో అత్యవసర వస్తు సామగ్రిని సిద్ధం చేసుకోండి.
☞ ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలు వెళ్లండి.
☞ మీ పత్రాలు/సర్టిఫికెట్లు, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లు లేదా కవర్లలో ఉంచుకోండి.
☞ ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి. అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షన్లను తీసివేయండి. తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.
☞ మీ ఇల్లు సురక్షితం కాకపోతే తుపాను ప్రారంభానికి ముందే సురక్షితమైన షెల్టర్‌ను చేరుకోండి.
☞ పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్లు స్తంభాల కింద ఉండకండి.
☞ పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాడును విప్పి వాటిని వదిలివేయండి.
☞ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకండి.