Current Charges | ఏపీవాసులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభవార్త తెలిపారు. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి యూనిట్‌కు 13పైసలు తగ్గిస్తామని ప్రకటించారు. విద్యుత్ చార్జీల ట్రూడౌన్‌పై ఆదివారం తాడేపల్లిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడారు.
విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీని నిలబెట్టుకున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జగన్ పెంచిన ట్రూఅప్ చార్జీలను ట్రూడౌన్ చేసే దిశగా కార్యాచరణ చేపట్టామని పేర్కొన్నారు. అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేయడాన్ని నియంత్రించామని తెలిపారు. దీనివల్ల యూనిట్‌కు 13 పైసలు తగ్గించగలిగామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో చార్జీలను మరింత తగ్గిస్తామని.. ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూస్తామని చెప్పారు. ట్రూఅప్ చార్జీల కింద రూ.926 కోట్ల వరకు తగ్గించామని అన్నారు.
2014లో లోటు విద్యుత్ నుంచి 2019 నాటికి మిగులు విద్యుత్ సాధించామని తెలిపారు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత విద్యుత్ అవసరాలు తీర్చలేక మళ్లీ లోటులోకి వెళ్లిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన నష్టం చేకూర్చారని విమర్శించారు. ప్రజలపై రూ.18వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. రూ.1.25లక్షల కోట్ల వరకు విద్యుత్ వ్యవస్థకు నష్టం చేకూర్చారని అన్నారు. తాము వచ్చాక సంస్కరణలు తెచ్చి విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టామని అన్నారు. తాము తెచ్చిన సంస్కరణల వల్లే విద్యుత్ చార్జీలు తగ్గించగలిగామని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లకు ఎక్కువ ఖర్చు పెట్టడం తగ్గించామని అన్నారు. ఇతర రాష్ట్రాలతో విద్యుత్ ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరిస్తున్నామని అన్నారు. సూర్యఘర్ పథకం కింద ఏపీకి 20 లక్షల కనెక్షన్లు వచ్చాయని తెలిపారు. సౌరపలకలు ఏర్పాటు చేసుకున్న వారికి రాయితీ ఇస్తున్నామని చెప్పారు.