TTD | టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం నాడు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నామని చెప్పారు. పాలకమండలి సమావేశం అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
– తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02వ తేదీ వరకు జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నాం.
– ఈ నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 05.43 గం.ల- 06.15 గం.ల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణము నిర్వహిస్తారు.
– బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏపీ సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నాం. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారు పెద్దశేష వాహనంలో సీఎం పాల్గొంటారు.
– సెప్టెంబరు 25వ తేదీన పీఏసీ- 5 శ్రీ వెంకటాద్రి నిలయాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. అదేవిధంగా 2026వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను సీఎం ఆవిష్కరిస్తారు.
– ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యను ఇస్రో సహకారంతో శాటిలైట్ ఆధారంగా లెక్కించేందుకు చర్యలు చేపట్టాం.
– బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, వివిధ దేవతామూర్తుల ఆర్చిలు, ఎల్ఈడీ తోరణాలు, అన్ని ప్రధాన కూడళ్ళలో పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం.
– బ్రహ్మోత్సల సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి అక్టోబర్ 02వ తేదీ వరకు దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్.ఆర్.ఐ, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశాం. బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం.
– ప్రతి రోజు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతున్నాం.
– ఈ నెల 28న గరుడ సేవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేస్తున్నాం. అదేవిధంగా, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారులు 28వ తేదీన రౌండ్ ద క్లాక్ తెరిచే ఉంటాయి.
– తిరుమలలోని రద్ధీ ప్రాంతాల్లో అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
– బ్రహ్మోత్సవాలలో చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నాం.
– బ్రహ్మోత్సవాలలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాం.
– ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు స్వామివారి వాహనసేవలను వీక్షించేలా హెచ్డి క్యాలిటీతో నాణ్యంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.
– గరుడసేవనాడు 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు అందించేందుకు చర్యలు తీసుకున్నాం.
– తిరుమలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ఫల పుష్ప ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాం.
– అదే విధంగా, కర్ణాటక రాష్ట్రం బెలగావిలోని కొలికోప్ప గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో 7 ఎకరాలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని నిర్మించేందుకు ఆమోదించాం.
– గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రూ. 7.20 కోట్లతో రాజగోపురం, ముఖ మండపం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆభరణాలు, అదేవిధంగా ఆలయంలో తాగు నీటి సౌకర్యం, ఆర్చి, మరుగుదొడ్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు దశలవారిగా చేపట్టేందుకు నిర్ణయం.
– అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ పుష్కరిణి, కల్యాణ వేదిక మండపం, రాజగోపురం, ఆర్చి, కల్యాణ మండపం తదితర అభివృద్ధి పనులకు రూ.5.73 కోట్లు, తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పుష్కరిణి పునః నిర్మాణానికి రూ.1.50 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయం.
– హైదరాబాద్‌కు చెందిన బద్రి వెంకటరెడ్డి, బద్రి విష్ణువర్ధన్ రెడ్డిలు గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబరు 141-2లో రూ.89.54 లక్షల విలువ చేసే 0.74 సెంట్ల స్థలాన్ని దాతలు టీటీడీకి విరాళంగా అందించారు. సదరు భూమిని స్వీకరించేందుకు ఆమోదం.
• అదేవిధంగా, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మొదటి దశలో రాష్ట్రంలోని దళిత వాడల్లో 1000 ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం.
• టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.