Srisailam | లోక కల్యాణార్థం శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం భ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజుల్లో స్వామి అమ్మవార్లకు ఊయల సేవ జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అర్చక స్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పం పఠిస్తారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగాలని మహా గణపతి పూజ జరిపించారు. అనంతరం ఊయలలో వేంచెబు చేయించిన స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపించారు. చివరిగా స్వామి అమ్మవార్లకు ఊయల సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు. పుష్పాలంకరణ కోసం పలు పుష్పాలు వినియోగించారు.
శ్రీశైల దేవస్థానానికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ట్రాక్టర్ బహుకరించింది. ఈ మేరకు ట్రాక్టర్ ను శ్రీశైలం ఈఓ డీ పెద్దిరాజుకు బ్యాంక్ చైర్మన్ ఎస్ సత్య ప్రకాశ్ అందజేశారు. ఈ ట్రాక్టర్ విలువ రూ.12 లక్షల వరకూ ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం వద్ద ట్రాక్టర్కు వాహన పూజ జరిపించారు. కార్యక్రమం తర్వాత బ్యాంకు అధికారులకు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్ర పటం అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీ రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజిన్ (ఐ/సీ) చంద్రశేఖర వర్మ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నంద్యాల రీజనల్ మేనేజర్ పీవీ రమణ, శ్రీశైలం శాఖ మేనేజర్ కే సుబ్రహ్మణం, స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మాజీ మేనేజర్ కే రామచంద్ర శర్మ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.