తిరుపతి: శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు మొదలుకొని రాజకీయ పార్టీలు, మేధావులు, సామాజిక సంస్థలు సహా అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ చర్య తిరుపతి ప్రాంత ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని, అలాగే అభివృద్ధిని వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.
ఇలాఉండగా, తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ స్వాగతించారు. వివిధ రూపాల్లో తాము చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఎట్టకేలకు ప్రత్యేక జిల్లా సాకారమైందని పేర్కొన్నారు. శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లా కోసం తమ పార్టీ 1985 నుంచి ఆందోళనలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సర్వతోముఖాభివృద్ధికి కొత్త జిల్లా ఏర్పాటు మార్గం సుగమం చేస్తుందని సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు.
శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జీ రామా నాయుడు కూడా పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదని, తిరుపతిని సైన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌గా ప్రమోట్ చేయడంతోపాటు పురోగమించడంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని అశాభావం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా కోసం తమ పార్టీ సుదీర్ఘంగా పోరాటం కొనసాగించిందని, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నంద్యాల జిల్లా వాస్తవరూపం దాల్చిందని సంతోషం వ్యక్తం చేశారు.