Srisailam | కనుమ పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం గోపూజ మహోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గోకులంలో, దేవస్థానం గో సంరక్షణ శాలలోనూ ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నిత్యం ఆలయంలో ప్రాత:కాల సమయంలో నిత్య సేవగా గోపూజ నిర్వహిస్తున్నారు. కనుక పండుగ సందర్భంగా మంగళవారం నిత్య గో సేవతోపాటు విశేషంగా గో పూజ జరిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈఓ డీ పెద్దిరాజు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయంలోని శ్రీ గోకులం వద్ద లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు, వేద పండితులు పూజా సంకల్పం పఠించారు. తర్వాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహా గణపతి పూజ జరిపించారు. అనంతరం శ్రీ సూక్తంతోనూ, గో అష్టోతర్త మంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపించారు. గోవులకు, గోవత్సాలకు (ఆవు దూడలకు) నూతన వస్త్రాలు సమర్పించారు. చివరగా గోవులకు నివేదన, నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించారు.
ఆ తర్వాత దేవస్థానం గో సంరక్షణ శాలలోని శ్రీక్రుష్ణుడి విగ్రహానికి పూజాదికాలు జరిపించారు. తదుపరి గోవులకు సంప్రదాయ బద్దంగా పూజాదికాలు నిర్వహించారు. అదే విధంగా ఈ విశేష కార్యక్రమంలో వృషభాలకు కూడా సంప్రదాయ బద్దంగా గ్రాసం అందజేశారు.
మన వేద సంస్కృతిలో గోవుకు ఎంతో విశేష స్థానం ఉంది. మన వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయి. సకల దేవతలకు ఆవాస స్థానం కావడం వల్ల గోవును పూజించడంతో దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతే కాక గోపూజ ఆచరించడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం పీఆర్ఓ – గో సంరక్షణ శాల ఇన్చార్జి టీ శ్రీనివాసరావు, పర్యవేక్షకులు వెంకటేశ్వర రావు, బీ శ్రీనివాసులు, గోశాల సిబ్బంది పాల్గొన్నారు.