అమరావతి : ఐదేండ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి(Purandeswari) ఆరోపించారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే నాడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (SC, ST atrocity ) కేసులు పెట్టారని ఆరోపించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆమె శుక్రవారం విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ వల్ల నిలిచిపోయిన పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పోలవరానికి కేంద్రం రూ. 12 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. అమరావతి(Amaravati) నిర్మాణానికి ఇప్పటి వరకు కేంద్రం 15 వేల కోట్లు ఇవ్వనుందని తెలిపారు. అమరావతి అభివద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వాస్తవానికి విశాఖ స్టీల్ నిర్వహణను ఎవరూ గుర్తించడం లేదని అన్నారు.