అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ విద్యార్థులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఎంట్రి ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతుంది. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి అధికార వైసీపీ ప్రభుత్వమంటూ విద్యార్థులు, తల్లిదండ్రులతో లోకేశ్ జూమ్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో లోకేశ్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా విద్యార్థులను పక్కన పెట్టి స్క్రీన్‌పై ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రత్యక్షమవడంతో నిర్వాహకులు వారి కాల్‌ను కట్ చేశారు.
వైసీపీ నేత దేవేందర్‌రెడ్డితో లోకేశ్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన పవిత్రమైన సమావేశాన్ని డిస్టర్బ్ చేయడానికి వైసీపీ నేతలు దొంగచాటుగా ప్రత్యక్షమయ్యారని దుయ్యబట్టారు. నేరుగా చర్చకు రావాలంటూ వారికి సవాలు విసిరారు. వైసీపీ ఫేక్ పార్టీ కాబట్టే ఫేక్ ఐడీలతో వచ్చారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
వల్లభనేని వంశీ వివరణ ఇస్తూ విద్యార్థులకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఉపన్యాసం ఇచ్చాడని విమర్శించారు. రాజకీయ ప్రేరేపిత ఉపన్యాసాలతో పిల్లలను చెడగొట్టొద్దని సూచించారు. కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ నాయకులు చంద్రబాబు, లోకేశ్ విధానాల వల్ల రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆరోపించారు. ఆత్మహత్యలకు ప్రేరేపించేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.