తిరుపతి : శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, నెయ్యి తయారీ ప్లాంట్ల నిర్మాణం పనుల్లో మరింత వేగం పెంచాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఎస్వీ గోసంరక్షణ శాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు, గోసంరక్షణ, దేశవాళీ గోవుల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. గోవుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లు, గోజాతుల రకాలు, ఫీడ్ మిక్సింగ్, నెయ్యి తయారీ ప్లాంట్ల నిర్మాణాలను తనిఖీ చేశారు.
అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో పురోగతిని పెంచి రోజువారీగా తనకు సమాచారం అందించాలన్నారు. గోశాలలోని జింకలను ఎస్వీ జూపార్కులో టీటీడీ నిర్మించిన ఎన్ క్లోజర్స్ కు తరలించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. గోఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు గోశాల ద్వారా అందిస్తున్న గోవులు, ఎద్దుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి గోపాల మిత్రల సేవలు వాడుకునే విషయం పరిశీలించాలని ఆమె చెప్పారు.
తిరుపతి లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా గోసంరక్షణ, సనాతన హిందూ ధర్మంలో గోమాత ప్రాశస్యతను వివరించేలా క్షేత్రస్థాయిలో అవగాహన, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. టీటీడీకి రోజుకు అవసరమయ్యే నాలుగు వేల లీటర్ల పాలు, పెరుగు, మజ్జిగ, తిరుమలలో స్వామివారి దీపాలు, కైంకర్యాలకు అవసరమయ్యే 60 కిలోల నెయ్యి పూర్తి స్థాయిలో గోశాల లోనే తయారు చేసేలా సిద్ధం కావాలన్నారు.