అమరావతి : ఏపీ కరువురహిత రాష్ట్రంగా తయారుకావాలంటే నదుల అను సంధానం ఏకైక మార్గమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. ఎన్టీఆర్ (NTR) వర్ధంతి సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికతను ఉపయోగించుకుని నదుల అనుసంధానాన్ని సాధించడమే ధ్యేయమని పేర్కొన్నారు. గోదావరి -పెన్నా ( Godavari-Penna) , పోలవరం ప్రాజెక్టు (Polavaram) నుంచి నాగార్జునసాగర్ రైట్ కెనాల్ వరకు గోదావరి జలాలు తీసుకొచ్చి రిజర్వాయర్ నిర్మించి అక్కడినుంచి వెలుగొండ వరకు నీరు ఇస్తామని అన్నారు. అక్కడి నుంచి నల్లమల ఫారెస్టు గుండా టన్కెల్ నిర్మించి బనకచర్ల ( Banakacharla) వరకు నీళ్లు వస్తాయని వెల్లడించారు.
తాను కూడా రాయలసీమలోనే పుట్టానని, రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కడపలోని కొప్పర్తిని పారిశ్రామిక కేంద్రంగా తయారు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో పది టూరిస్టు ప్లేస్‌లో గండికోట ఒకటని, ఈ ప్రాంతాన్ని మంచి టూరస్టు హబ్‌గా మారుస్తామని అన్నారు.
తెలుగు జాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి , అనుక్షణం తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం తపించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవమని అన్నారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు.. సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని అభివర్ణించారు. రాజకీయమంటే పెత్తందారి విధానం కాదు.. పేదల జీవితాలు మార్చేదని చేసి చూపించారని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దానికి ఎన్టీఆరే కారణమని అన్నారు.