Heart Attack | బస్సు నడుపుతుండగా ఓ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ ముందు తన పరిస్థితి గురించి కాకుండా.. బస్సులో ఉన్న 50 మంది విద్యార్థుల గురించి ఆలోచించాడు. సమయస్ఫూర్తితో బస్సు వేగాన్ని తగ్గించి, ఓ పక్కన ఆపేశాడు. అనంతరం స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన డి.నారాయణరావు వృత్తిరీత్యా డ్రైవర్. రాజమండ్రి డైట్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు డ్రైవర్‌గా అతను పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం కొత్తపేట మండలం గంటి నుంచి విద్యార్థులను ఎక్కించుకుని కాలేజీకి వెళ్తున్న సమయంలో నారాయణరావుకు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నారు.
ఛాతీనొప్పి రావడంతో అప్రమత్తమైన నారాయణరావు వెంటనే బస్సు వేగాన్ని తగ్గించాడు. బస్సు ఆగుతుండగానే స్టీరింగ్‌పై వాలిపోయాడు. ఏమైందని విద్యార్థులు గమనించి వెళ్లి చూడగా.. అప్పటికే నారాయణ రావు స్టీరింగ్‌పై పడిపోయి ఉన్నాడు. దీంతో వెంటనే సేఫ్టీ హైవే పెట్రోలింగ్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.