Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లను నంద్యాల కలెక్టర్ జీ రాజకుమారి ఆదివారం పరిశీలించారు. హటకేశ్వరం, కైలాస ద్వారం, కమాండ్ కంట్రోల్ రూమ్, పారిశుధ్యం, 30 పడకల ఆసుపత్రి, వైద్య శిబిరాలు తదితర ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సీ విష్ణుచరణ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హటకేశ్వరం, కైలాస ద్వారం ప్రాంతంలో పాదయాత్రగా వస్తున్న భక్తులతో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నడకదారిలో మెడికల్ క్యాంపులు ఎలా నడుస్తున్నాయి? ఉచితంగా భోజనాలు అందిస్తున్నారా? తాగునీటి సదుపాయం ఎలా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నడకదారిలో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? పారిశుధ్యం ఎలా ఉంది.. కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం శ్రీశైల దేవస్థాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ని పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ఎలా పనిచేస్తుంది ? ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఎలా కోఆర్డినేట్ చేసుకొని సమస్యను పరిష్కరిస్తున్నారో సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. 30 పడకల ఆసుపత్రిని పరిశీలించి.. నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో చేరిన భక్తులను పరామర్శించి.. ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకున్నారు.