అమరావతి :ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి . మూడు రోజుల పాటు నిర్వహించుకునే పండుగ తొలిరోజు శనివారం తెల్లవారుజాము నుంచే తమ ఇళ్ల ఎదుట భోగి మంటలు వేసి జరుపుకున్నారు. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. మరోవైపు కోట్లాది రూపాయలు చేతులు మారే కోడి పందేలు సైతం పలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేయగా శనివారం ఉదయం పందేలను తిలకించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ,ఏలూరి జిల్లాలో కోడి పందేలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం, గుడివాడ, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేటలో,కాకినాడ నగరం, జగ్గంపేట, పెద్దాపురం,పిఠాపురపం, గొల్లప్రోలు, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ,నిడదవోలు, గోపాలపురం, ఉండ్రాజవరం, పెరవలి, నంద్యాల తదితర మండలాల్లోనూ పందేలకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఈ కోడి పందేలను తిలకించడానికి , కర్నాటక, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలువురు ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. భీమవరం, ఉండి ప్రాంతాల్లో కొన్ని బరుల వద్ద మహిళల కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.