అమరావతి : కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) పై విరుచుకు పడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రధానికి ఎందుకు కనిపించడం లేదని ట్విటర్( Twitter ) వేదిక ద్వారా ప్రశ్నించారు.
ప్రధాని తీరు తీరు పచ్చకామెర్లు సోకినోడి సామెతను తలపిస్తోందని, రైతుల అవస్థలు కనపడవు. గిట్టుబాటు లేక పంటలను తగలబెడుతున్న దృశ్యాలు కనపడవు. కిలో రూపాయి ధర పెట్టే దారుణాలు కనపడవు. తుఫాన్ల ధాటికి సర్వం కొల్పోతే ఆదుకోలేని నిర్లక్ష్యం కనిపించదని మండిపడ్డారు.
వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల మరణమృదంగం, ఫీజు రీయింబర్స్ చెల్లించక విద్యార్థుల కష్టాలు , ఆరోగ్య శ్రీ ఆపితే రోగుల పడుతున్న బాధలు, సూపర్ సిక్స్ హామీల పేరిట చేస్తున్న మోసాలపై నోరు ఎందుకు మెదపడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి నిర్లక్ష్యం రాస్తే రామాయణం.. వింటే మహాభారతంలా తయారైందని విమర్శించారు. ప్రజల హక్కులను,విభజన హామీలను మీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి, తల ఊపమంటే ఊపే గొర్రెల్లా కూటమి మారడంతో మోదీకి రాష్ట్రంలో కూటమి పాలన భేష్ అనిపిస్తోందని పేర్కొన్నారు.
ప్రధాని హోదాలో పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రానా నిజాలు మరుగున పడవని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానిది అసమర్థ పాలన. ఆర్భాటాలు, హంగామా తప్పా ఆచరణలో హామీల అమలు శూన్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీని మించిన రాజధానిగా అమరావతికి నిధులు ఇవ్వాలని షర్మిల కోరారు.