అమరావతి : ఏపీలో ప్రజలకిచ్చిన ముఖ్యమైన హామీల్లో ప్రధానమైన సూపర్సిక్స్ హామీలకు కూటమి సర్కార్ ఎగనామం పెడుతుందని వైసీపీ మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ( Ex-minister Chellboina ) ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా తోమాట్లాడారు.
ప్రజలను నమ్మించి మోసం చేయడమే చంద్రబాబు ( Chandra Babu) పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలంలో 12 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించారన్నారు. ఈ కేబినెట్లో ఏనాడు కూడా సూపర్సిక్స్ హామీల ( Super Six Guarantees) గురించి చర్చించకపోవడం దారుణమని అన్నారు.
చంద్రబాబు అనుభవం ప్రజలను మోసం చేయడానికేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదాయ వనరుల గురించి ఆలోచించకుండా అమలు కాని హామీలిస్తూ చివరకు చేతులు ఎత్తేయడం ప్రజలను వంచించడమేనని వెల్లడించారు. అధికారంలోకి రాగానే తల్లికి వందనాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ గత ఆరు నెలలుగా ఈ పథకాన్ని అమలు చేయని ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామంటూ కేబినెట్లో తీర్మానించడం ప్రజలను మోసగించడమేనని ఆరోపించారు.
తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల 87.42 లక్షల మంది విద్యార్థులు ఒక్క ఏడాదికే రూ. 13,112 కోట్లను నష్టపోయారని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం ద్వారా ఒకటి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ప్రతి తల్లి ఖాతాలో దాదాపుగా రూ. 26 వేల కోట్లను జమ చేశారని, రూ.73 వేల కోట్లుతో నాడు, నేడు ద్వారా విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టారని వెల్లడించారు.