(Jagan on PRC) అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్సీని వీలైనంత త్వరగా ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా.. రాష్ట్ర అర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా ఉద్యోగులకు జగన్ సూచించారు. ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరుగకూడదన్నది తమ ప్రభుత్వ విధానమని సీఎం తేల్చిచెప్పారు.
మొన్నటి వరకు కరోనా కేసులు, ఇప్పుడు ఒమిక్రాన్ పరిస్థితుల కారణంగా రెండున్నరేండ్లుగా రాష్ట్రం ఆదాయం చాలా దెబ్బతిన్నదని ఉద్యోగులతో భేటీలో సీఎం జగన్ అన్నారు. అధికారంలోకి రాగానే రెవెన్యూ ఎలాగైనా ఉండనీ.. ఉద్యోగులకు ఐఆర్ 27 శాతం రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అనంతరం సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు.
అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించామని, దాని కారణంగా రూ.17,918 కోట్ల ఆర్థిక భారం రాష్ట్రంపై పడిందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. జీతాలు, పెన్షన్ల కోసం రూ.67,340 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు వంటి దాదాపు 3 లక్షల మంది ఉద్యోగుల జీతాలు ఇప్పటివరకు రూ.1,198 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.3,187 కోట్లకు చేరిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేలు ఇచ్చామని, దాని వల్ల ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.360 కోట్ల భారం పడుతున్నదని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం వల్ల రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడిందని చెప్పారు.
మనకు బలం వస్తుందనే ఒకే ఒక్క కోణంతోనే తెలంగాణతో పోటీ పడుతున్నామని జగన్ అన్నారు. అయితే, తెలంగాణలో ఉన్న ఆదాయం మన వద్ద లేదని చెప్పారు. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.2,37,632 గా ఉండగా.. మన వద్ద రూ.1,70,215 మాత్రమే ఉన్నది. కాగ్ నివేదికలో పేర్కొన్న విధంగా తెలంగాణలో జీతాల కోసం రూ.17వేల కోట్లు, పెన్షన్ల కోసం రూ.5,603 కోట్లు.. మొత్తం ఖర్చు రూ. 22,608 కోట్లుగా ఉన్నదని, అదే మన రాష్ట్రంలో గమనిస్తే జీతాల కోసం రూ.24,681 కోట్లు, పెన్షన్ల కోసం రూ.11,324 కోట్లు.. మొత్తం ఖర్చు రూ.36 వేల కోట్లుగా ఉన్నదని చెప్పారు. ఇప్పటికిప్పుడు 14.29 శాతం ఫిట్మెంట్ డిక్లేర్ చేసినా జీతాలపై ఏడాదికి రూ.7,137 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని వెల్లడించారు. ఒకవైపు మనకు ఆదాయాలు తగ్గుతున్నప్పటీకీ ఎవరికీ అన్యాయం జరుగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారం వేయవద్దని సీఎం జగన్ సూచించారు. ఉద్యోగులకు చేయగలిగినంత మేలు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై స్పష్టత ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.