AP News | మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిపై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఆళ్ల నానితో పాటు మరికొందరిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో శాంతినగర్ లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో వైసీపీ నాయకుడు దిరిశాల వరప్రసాద్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. నాలుగో అంతస్తులో ప్రచారం ముగించుకుని కిందకు దిగేందుకు అందరూ ఒక లిఫ్ట్ ఎక్కారు. ఆ సమయంలో అది ఫెయిల్ అయ్యి ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో లిఫ్ట్‌లో ఉన్నవారంతా ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ ఘటనలో ప్రచారంలో పాల్గొన్న నాగమణి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఆనాడు జరిగిన ఎన్నికల ప్రచారంలో సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. ఈ విషయం తెలిస్తే ఎన్నికల సంఘం నుంచి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈ ప్రమాదాన్ని సీక్రెట్‌గా ఉంచేశారు. బాధితురాలు నాగమణి వైద్య ఖర్చులు పెట్టుకోవడంతో పాటు ప్రమాద బీమా వచ్చేలా చేస్తామని, ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పటి మంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు. దీంతో నాగమణి కూడా సైలెంట్‌గానే ఉన్నారు. కానీ ఆ తర్వాత మంత్రి ఆళ్ల నాని, ఇటు వాలంటీర్లు ఎవరూ పట్టించుకోలేదు. నష్టపరిహారం కూడా రాలేదు.
దీనిపై బాధితురాలు గట్టిగా అడగ్గా వైసీపీ నాయకులు బెదిరించారు. దీంతో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు శనివారం రాత్రి ఆళ్ల నాని, దిరిశాల వరప్రసాద్, సుధీర్ బాబు, జీలూ ఖాన్, కురెళ్ల రాంప్రసాద్‌తో పాటు ప్రైవేటు వైద్యులు సునీల్ సందీప్, లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ ప్రెసిడెంట్, సెక్రటరీలపై కేసు నమోదు చేశారు.