తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ
శ్రీనివాసుడు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో
విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో రథోత్సవం కోలాహలంగా జరిగింది.
అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహిస్తామని, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిస్తారని టీటీడీ అర్చకులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఆలయ ప్రధాన అర్చకులు కంకణబట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, అధికారులు పాల్గొన్నారు.