Pulivarthi Nani | రాజకీయ కక్షలతో తన కుమారుడిపై కేసులు పెట్టి అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే భంగంపాటు తప్పదని హెచ్చరించారు.
దాడి చేసిన సంఘటనలో పాల్గొన్న వారే ప్రధాన నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు చెప్పడం జరిగిందని పులివర్తి నాని తెలిపారు. అందుకే తనపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడిగా మోహిత్ రెడ్డి పేరు చేర్చారని అన్నారు. విదేశాల్లో చదివితే హత్యాయత్నం చేసిన వారిని వదిలేస్తారా అని ప్రశ్నించారు. చట్టాన్ని తన చేతిలో తీసుకుని శిక్షించడానికి తప్పుడు కేసులు పెట్టడానికి తాను రెండు నెలలు ఎదురు చూడాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.
చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి తనకు సమయం చాలడం లేదని.. ఇక కక్ష సాధింపు చర్యలకు సమయం ఎక్కడిదని పులివర్తి నాని ప్రశ్నించారు. కక్షపూరితమైన రాజకీయాలు చేయాలనుకుంటే ఇన్ని రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు తప్పుడు సమాచారం, తప్పుడు సంకేతం ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. గత ఐదేళ్లలో చెవిరెడ్డి అనేక అక్రమాలు చేశారని ఆరోపించారు. చెవిరెడ్డి అక్రమాలు బయటకు తీస్తే దేశద్రోహం కింద జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు.