ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసకర, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించారు.
గత ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలబెట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని హరిత ఆంధ్రప్రదేశ్గా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, విద్యా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారని చెప్పారు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్, మద్యాంధ్రప్రదేశ్, అనారోగ్యాంధ్రప్రదేశ్గా మార్చేస్తున్నారని మండిపడ్డారు.
రెండు లక్షలు కొట్టు…బెల్ట్ షాపు పెట్టు..!
“చంద్రబాబు సంపద సృష్టి” లో భాగంగా గ్రామాల్లో మద్యం దుకాణాల కోసం జనాభా ప్రాతిపదికన ధర నిర్ణయం చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. అధిక మొత్తం వెచ్చించి మద్యం దుకాణాలను దక్కించుకున్న టీడీపీ సిండికేట్ వ్యాపారులు గ్రామాలలో బెల్ట్ షాపులు లైసెన్స్ ఇచ్చేస్తున్నారని అన్నారు. బెల్ట్ షాపుల కోసం జనాభా.. మద్యం విక్రయాల.. స్థాయిని బట్టి రెండు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందులో స్థానిక టీడీపీ నాయకులే మొత్తం ప్రక్రియలో చక్రం తిప్పుతున్నారని అన్నారు. ఎక్సైజ్ అధికారులు అటువైపు చూడకుండా.. దరిదాపుల్లో మరో బెల్ట్ షాపు ఏర్పడకుండా…. సిండికేట్ వ్యాపారులే అన్నీ చూసుకుంటున్నారని అన్నారు. అందుకే ఈ టీడీపీ ప్రభుత్వాన్ని దొంగ ప్రభుత్వం.. దోపిడీ ప్రభుత్వం అని మండిపడ్డారు.